20, జూన్ 2009, శనివారం

భారత భారతి - సుభాషితములు.

శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన
దానేన పాణిర్నతు కంకణేన
విభాతి కాయః కరుణాపరాణామ్
పరోపకారేణ న చందనేన.

చెవి వేదములు వినుట చేతనే శోభించును గానీ,
కుండలముల వలన కాదు.
చేయి దానములు చేయుట వలన శోభించును గానీ,
కంకణముల వలన గాదు.
దయ గల వారి శరీరము పరోపకారము చేతనే శోభించును గానీ,
మంచి గంధము చేత కాదు.

భారత భారతి - సుభాషితములు.

విదేశేషు ధనం విద్యా వ్యసనేషు ధనం మతిః
పరలోకే ధనం ధర్మః శీలం సర్వత్ర వైధనమ్

విదేశములందు విద్య, కష్టములందు బుద్ధి,
పరలోకము నందు ధర్మము
ధనము కాగా, శీలము అంతటనూ ధనమగును.
అనగా శీలము అన్నిటి కన్ననూ గొప్పది అని భావము.

14, జూన్ 2009, ఆదివారం

భారత భారతి - సుభాషితములు.

న శరీర మల త్యాగాత్ న రో భవతి నిర్మలాః
మానసేతు మలే త్యక్తే తతో భవతి నిర్మలః

కేవలం శరీర మలములను దూరం చేసుకున్నంత మాత్రాన
మనిషికి నిర్మలత్వం రాదు.
మనసు లోని కామ, క్రోధాదులను జయించడం ద్వారా
మనిషి లోని నిర్మలత్వం
బయట పడును.

భారత భారతి - సుభాషితములు.

న వేష ధారణం సిద్ధేః కారణం న చ తత్కథాః
క్రియైవ సిద్ధేః కారణం నాత్ర కార్యస్తు సంశయః

కేవలం పేషాలు వేసుకుని, ప్రసంగాలు ఇవ్వడం ద్వారా విజయం లభించదు.
ఈ నైతిక విలువలు క్రమ పద్ధతిలో పాటించడం ద్వారానే సిద్ధి కలుగును.

భారత భారతి - సుభాషితములు.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్య మప్రియమ్.

సత్యమునే చెప్పవలెను.
అదీ అవతల వారికి మేలు చేయునవే చెప్పవలెను.
అవతల వారి శ్రేయస్సు కోరునదియై ఉండవలెను.
అట్లు గాక అవతల వారికి కీడు జరుగునని తెలిసి,
వారికి ప్రియము కాదని తెలిసి, చెప్పరాదు.

భారత భారతి - సుభాషితములు.

అర్థాగృహే వివర్తన్తే శ్మశానే మిత్ర బాంధవాః
సుకృతం దుష్కృతం చైవ గచ్ఛన్త మను గచ్ఛతః

సంపదలు గృహంలోనే ఉండిపోతాయి. మితృలు, బంధువులు శ్మశానం వరకూ వచ్చి,తిరిగి పోతారు. చనిపోయిన వారి వెంట వచ్చేవి వారి పాప పుణ్యములే.