4, జులై 2009, శనివారం

భారత భారతి. సుభాషితములు.

కో హి భారః సమర్ధానాం కిం దూరం వ్యవసాయినామ్
కో విదేశః సువిద్యానాం కః పరః ప్రియవాదినామ్.

సమర్ధులకు చేయ శక్యం కానిదంటూ ఏదైనా ఉంటుందా.
నిరంతరం ఉద్యమం చేసే వాళ్ళకి దూరం ఏమిటి.
మంచి విద్య కలవాళ్ళకి విదేశం ఏమిటి.
ప్రియంగా మాట్లాడే వాళ్ళకి పరాయి వాడు ఎవడు.


కర్తా కారయితా చైవ ప్రేరకో హ్యనుమోదకః
సుకృతే దుష్కృతే చైవ చత్వారః సమభాగినః

పుణ్యంలో అయినా పాపంలో అయినా చేసినవాడు,
చేయించినవాడు, చేయమని ప్రోత్సహించినవాడు
చాలా బాగా చేశావు అని ఆమోదించినవాడు
వీళ్ళు నలుగురూ ఫలాన్ని సమంగా పంచుకుంటారు.

కృపణేన సమోదాతా న భూతో న భవిష్యతి
అస్పృశ్యన్నేవ విత్తాని యః పరేభ్యః ప్రయచ్ఛతి.

పిసినారితో సమానమైన దాత ఇంతకు ముందు పుట్టలేదు.
ఇటు పైన పుట్టడు. ఎందుచేతననగా అతడు ధనం ముట్టుకోకుండానే
ఇతరులకు ఇచ్చేస్తాడు.

క్షణశః కణశశ్చైన విద్యామర్ధం చ సాధయేత్
క్షణ త్యాగే కుతో విద్యా కణత్యాగే కుతో ధనమ్.

ఒక్కొక్క క్షణం చొప్పునా, ఒక్కొక్క కణం చోప్పునా విద్యనూ,
ధనాన్ని సాధించాలి. క్షణం పోతే విద్య ఎక్కడ లభిస్తుంది.
కణం పోతే ధనం ఎలా పోగవుతుంది.

తైలాద్రక్షేజ్ఞలాద్రక్షేచ్ఛి ధిలబన్ధనాత్
మూర్ఖబస్తేన తొదవ్యమేవంవదతి పుస్తకమ్.

పుస్తకం ఇలా అంటుందిట - - నన్ను నూనె తగలకుండా
రక్షించాలి. నీళ్ళు తగలకుండా రక్షించాలి.
బంధనం ఒదులుకాకుండా చూచుకోవాలి.
నన్ను మూర్ఖుడి చేతుల్లో పెట్టకూడదు. అని.

పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినమ్
వర్ణయేత్తాదృశ్యం మిత్రం విషకుంభం పయోముఖమ్.

ఎదుట ప్రియంగా మాట్లాడుతూ, వెనకాల పనులు చెడగొట్టే,
పాలతో నిండిన కుండవలె కనబడే విషకుంభమైన మిత్రుణ్ణి
విడచివేయాలి.

మాత్రా సమం నాస్తి శరీర పోషణం విద్యా సమం నాస్తి శరీర పోషణమ్
భార్యా సమం నాస్తి శరీరతోషణం చిన్తాసమం నాస్తి శరీరశోషణమ్.

తల్లి వలె శరీరాన్ని పోషించేది మరేదీ లేదు.
విద్యతో సమానమైన శరీరాలంకారం లేదు.
భార్యవలె శరీరానికి సౌఖ్యం కలిగించేది మరొకటి లేదు.
చింతవలె శరీరాన్ని మండింపచేసేది మరేదీ లేది.

మౌనం కాల విలంబశ్చ ప్రమాణం భూమి దర్శనమ్
భృకుట్యన్యముఖీ వార్తానకారః షడ్విధః స్మృతః

ఎవరైనా వచ్చి ఏదైనా కోరినప్పుడు లేదని చెప్పడానికి
ఆరు పద్ధతులు ఉన్నాయి. మాటలాడకపోవడం, ఆలశ్యం చేయడం,
అక్కడనుంచి లేచి వెళ్ళిపోవడం, నేలవైపు చూడడం,
కనుబొమ్మలు విరవడం, ముఖం మరొకవైపు త్రిప్పి మాటలాడడం
ఇలా లేదు అనడానికి ఆరు పద్ధతులు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి